Posted by Sakshyam Magazine on Saturday, September 2, 2017
నిజానికి మతపరమైన ఉగ్రవాదమే కాదు.మతానికి అతీతమైన ఉగ్రవాదం కూడా ఉంది. అయితే మతపరమైన ఉగ్రవాదానికి సంబంధించి మనం గమనించాల్సిన విషయమేమిటంటే మతం వేరు, మత మౌడ్యము వేరు. ఈరోజు మతాల పేరు చెప్పి దారుణాలకు పాల్పడే వారంతా ఈ మత మౌడ్యమనే జబ్బుతో బాధపడేవారే!
ఈ జబ్బు గలవారు కేవలం ముస్లింలలోనే ఉన్నారనుకుంటే పెద్ద పొరపాటు. ఈ మానసిక వ్యాధిగ్రస్తులు ప్రతి మతంలోనూ ఉన్నారు. దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరికి తమ ప్రాణాల పట్ల గాని, ఎదుటివారి ప్రాణం పట్ల గాని ఎటువంటి విలువా ఉండదు. వీరిలో దయా దాక్షిణ్యాలు, మానవతా విలువలు ఏకోశానా కనిపించవు. వీరి దృష్టిలో హింస, మారణహోమాలే తమ మత బోధనలుగా ప్రేరేపితమై ఉంటారు. వీరి జబ్బు ఎంతవరకూ ముదిరిపోయి ఉంటుందంటే ఎదుటి మతస్తులనే కాదు. స్వయంగా తమ మతస్తులను సైతమూ మట్టు బెట్టేస్తారు.

ఉదాహరణకు మనం పేపర్లలో చదువుతూ ఉంటాం. పాకిస్తాన్లో అక్కడ బాంబ్ పేలింది. ఇక్కడ బాంబ్ పేలింది అక్కడ అంతమంది చనిపోయారు ఇక్కడ ఇంతమంది చనిపోయారని వ్రాస్తారు. అక్కడ చనిపోయింది ఎవరు? బాంబ్ పెట్టిందేవరు? వాళ్ళందరూ ముస్లింలే గదా? ఇలా చెప్పుకుంటూ పొతే హైదరాబాద్ మక్కా మసీద్ పేలుళ్లు కూడా వస్తాయి. వీరికి నావాడు మీవాడు అని ఉండదు. ఇక్కడ గమనించాల్సింది ఉగ్రవాదం అంటే కేవలం బాంబులు పెట్టడం, పేల్చడం మాత్రమేకాదు. అది ఏరూపంలో ఉన్నా, ఏవిధంగా ఉన్నా అది ఉగ్రవాదమే. ఇంకా ముందు కెళ్తే సామాన్య ప్రజలను మతం పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి దోచుకోవడమూ, సామాన్య ప్రజల హక్కులను సైతం లాక్కోవడం కూడా ఉగ్రవాదం క్రిందికే వస్తుంది. ఇంకా తమ,తమ పార్టీల కోసం తమ అనుకూల ప్రజలను రెచ్చగొట్టి, పిచ్చి వాళ్ళగా మార్చి అనేక గొడవలకూ, మారణహోమాలకు పాల్పడేలా చేసే రాజకీయ నాయకులు కూడా ఉగ్రవాదుల కోవలోకే వస్తారు.

అంతెందుకు? నిన్నటికి మొన్న ధర్మీత్ రాం రహీం సింగ్ సచ్చా సౌధా పేరుతో ఆశ్రమాన్ని నడుపుతూ ఎందరో అమ్మాయిల మానంతో ఆటలాడుకున్న ఆ డేరా బాబా ఉగ్రవాది కాదనగలమా? అతని బోధనలూ, అతనిగారి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆయన శిష్యుల చేత పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో అంతటి మారణహోమాలకి పాల్పడేలా చేస్తాయా? డేరా బాబా అకృత్యాలకు బలయ్యినవారు తమ ఇంటి ఆడపడుచులు కాదా అని ఆలోచిస్తే.. ఆలోచించే జ్ఞానం ఆ శిష్యులు కలిగియుంటే ఈ దారుణాలు చాలా వరకూ తగ్గిపోయేవి. అధికారాన్ని చూసుకుని ఈమధ్య రెచ్చిపోతున్న కొన్ని మత సంస్థలను కూడా మనం ఉగ్రవాద లిస్టులోకి తీసుకురాకుండా ఉండలేము.
ఇవన్నీ కప్పిపుచ్చడం కోసం ఉగ్రవాదమంటేనే ఇస్లాంకు, ముస్లిములకు పరిమితం చేసి పారేసాం. ఇది ఎంతవరకూ పోయిందంటే ఏదైనా యాక్షన్ సినిమా తీయాలంటే అందులో విలన్ ని గడ్డం పెట్టి ముస్లింగా అన్నా చూపించాలి. లేకపోతే విలన్ రాజకీయ నాయకుడైతే ప్రజలలో బాంబ్ పెట్టి పేల్చే సన్నివేశంలో తన అనుచరులు ముస్లింల క్రిందయినా వేషం వేయించాలి. సినిమాలు కూడా ప్రజలలో ఉగ్రవాదులంటే ముస్లిములే అనే అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి. కాని ప్రజలలో బాంబ్ పెట్టించే ఆ రాజకీయ విలన్ పాత్ర ఎంత భయంకర ఉగ్రవాద పాత్రో ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే అతను ముస్లిం కాదు కదా? అచ్చం ఇలానే ఈరోజు ఉగ్రవాద రాజకీయం కూడా నడుస్తోంది.
నా అభిప్రాయాలను చూసి మీరు నేను కేవలం ఇస్లాం వాదినని అనుకుంటారు. అలా అనుకుంటే అది పెద్ద పొరపాటే కాదు తప్పిదం కూడా. ఎందుకంటే నా అసలు ఉద్దేశ్యం ఉగ్రవాదం యొక్క మరికొన్ని తలకాయలను చూపించే చిన్న ప్రయత్నం మాత్రమే! నా అభిప్రాయాలు మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆలోచింపచేయవచ్చు. ఆలోచన కూడా కలిగించక పోవచ్చు. అది మీఇష్టం.
ఇక పొతే అత్యధికులు భావిస్తున్నట్టు వీటన్నిటికీ ఈరోజు పండితవర్గం నుండి,సామాన్య వర్గము వరకూ అనుసరిస్తున్న మన ధార్మిక శాస్త్రాలే కారణమా? అంటే వాటికి ఈ మారణహోమాలకు ఏవిధమైన సంబంధమూ లేదు. ఏ గ్రంధమూ హింసను ప్రేరేపించదు. నిజానికి మన ధార్మిక గ్రంధాలు ప్రతిపాదించే ధర్మానికి, ఈ ఉగ్రవాదానికి ఏవిధమైన సంబంధమూ లేదు. సమాజంలో ఉన్న ఉగ్రవాదాన్ని తీసుకు వచ్చి ఆయా మతస్తుల గ్రంధాలపై మనం అన్యాయంగా రుద్దుతున్నాం. ఒక మత అవలంబీకుడు ఎదుటి మత అవలంబీకుడిపై ఉగ్రవాదమనే నిందను మోపుతూ పోతున్నాడు. ఏ మత అవలంబీకుడైనా కావచ్చు, ఆధ్యాత్మిక గురువైనా కావచ్చు.వారు ఎవరైనా కావచ్చు ఎప్పుడైతే హింసను ప్రేరేపిస్తాడో అప్పుడు వాడు ఉగ్రవాదే! వాడికి వాడి ధార్మిక శాస్త్రంతో ఉన్న లింక్ తెగిపోతుంది.
ఈరోజు సమాజంలో ఉన్న ఉగ్రవాదం కేవలం మతపరమైనవే అనుకుంటే తప్పే! మతాలకు అతీతమైన ఉగ్రవాదం కూడా ఉంది. ఇకపోతే మతపరమైన ఉగ్రవాదులు మతస్తులు కాదు. మతోన్మాదులు, మతమౌడ్యపు జబ్బు గలవారు. పిచ్చివాడు రాయి తన వాడా? మన వాడా అని చూసి విసరడు. ప్రతివాడి మీద విసురుతాడు. వీళ్ళూ ఇంతే! కాబట్టి ఉగ్రవాదులకూ, శాస్త్ర ధర్మాలకు ఏవిధమైన సంబంధమూ లేదు.ఉండదు కూడా! శుభం!జైహింద్! -
K.S.Chowdary : Sakshyam Magazine Editor