Posted by Sakshyam Magazine on Thursday, April 23, 2015

"పూజ"అనే పదానికి శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారం -సపర్య, అర్చన అనే అర్ధాలు చెప్పబడుతున్నాయి. అంటే - పూజ అనే పదం గౌరవం, మర్యాద, సత్కారం, సేవ ఇత్యాది విభిన్న అర్ధాలలో వినియోగించబడుతుందన్నమాట.
మానవుడు తన సృష్టికర్త పట్ల, తలిదండ్రుల పట్ల, గురువుల పట్ల అలాగే ఇతర సంబంధీకుల పట్ల ఒక విధమైన "భావోద్వేగ"పూరిత సంబంధాన్ని కిలిగి ఉంటాడు.దానినే గౌరవం, మర్యాద, సత్కారం మరియు పూజా, ఆరాధనల రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటాడు. పైన పేర్కొన్న వారందరి పట్ల అతని ఆ పూజా లేదా ఆరాధనా "భావము" ఒకే విధమైనది కాక విభిన్న "స్థాయిలలో ఇంకా వివిధ "రూపా"లలో కూడా ఉంటుంది.ఉండాలి కూడా.
ఎందుకంటే -
ఉదాహరణకు; ఒక భిక్షవానికి భిక్షవేయటం అతని పట్ల అది పూజ అవుతుంది. పొరుగు వారి పట్ల సఖ్యతగా లేదా ఇబ్బంది కలిగించకుండ ఉంటే అది వారి పట్ల పూజ అవుతుంది. అదే ఒక అన్న, చెల్లెల మధ్య పూజా భావం అనగా- కేవలం వారిని గౌరవించడమే కాక వారికి చెందవలసిన తలిదండ్రులు విడిచి వెళ్లిన ఆస్తిని సైతం న్యాయంగా వారి వాటా వారికి పంచి ఇవ్వటం కూడాను. దీనిని అనుసరించి తనతో సంబంధం కలిగి ఉన్న ఆయా వ్యక్తులను బట్టి ఆయా విధాలుగా పూజా స్థాయిలు-రూపాలు మారిపోతూ ఉంటాయని అర్ధమవుతుంది.
ఆథ్యాత్మిక జీవనాన్ని సాగిస్తున్న ప్రతి వ్యక్తి దృష్టిలో సర్వసృష్టికర్త ఉన్నతునిగానే కాక సర్వోన్నతునిగా ఉంటాడు. ఆ తరువాత ఆయన నియమించిన రుషులు లేక ప్రవక్తలు అత్యుత్తములై ఉంటారు. ఇక తన తోటిమానవులు సాధారణ స్థాయి కలిగి ఉంటారు. కనుక అతడు వీరందరి పట్ల తప్పనిసరిగా పూజా లేదా ఆరాధన భావము కలిగి ఉండవలసిందే! కాబట్టి "సామాన్యుల" పట్ల కలిగి ఉండే దానిని "సామాన్య పూజగాను, "ఉత్తముల" పట్ల కలిగి ఉండే దానిని "ఉత్తమ పూజ"గానూ సర్వోన్నతుని" పట్ల కిలిగి ఉండే దానిని "సర్వోన్నత పూజ"గానూ అభివర్ణించవచ్చు. వాటి భావ పరమైన స్థాయిలు వేర్వేరుగా ఉన్నప్పుడు, వాటి ఆచరణాత్మక రూపాలు కూడా వేర్వేరుగా ఉంటాయన్నది వేరేగా చెప్పనవసరం లేదు. అవి ఏ స్థాయిలలో ఏ రూపాలలో ఉంటాయో ఈ క్రింది గమనించగలరు.
1.సామాన్య పూజారూపకం: గౌరవభావం * సేవా తత్పరత *ఆత్మగౌరవానికి భంగంకలగకుండా సామాన్య ప్రజల పట్ల ప్రవర్తించటం.
2.ఉత్తమ పూజా"రూపకం: గొప్ప గౌరవభావం * దైవాదేశాలను వారు ఆచరించిన పద్ధతిలోనే పాటించటం లాంటివి రుషుల, మహనీయుల పట్ల వ్యక్త పరచటం.
3.సర్వోన్నత పూజా"రూపకం: అత్యంత గౌరవ భావం *ఘన కీర్తనలు *ఆజ్ఞాపాలన *వేడుకోలు విన్నపాలు కేవలం ఒక్క సర్వోన్నతుని పట్ల మాత్రమే కలిగి ఉండటం.
సర్వోన్నతుని పూజ గురించి మరి కాస్త వివరంగా చెప్పాలంటే
- మేలు చేవాడు
- కీడు నుండి కాపాడేవాడు కేవలం ఆ సర్వేశ్వరుడు ఒక్కడు మాత్రమేనని నమ్మాలి
- మేలు కలిగితే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.
- కీడు సంభవిస్తే ఆయన పట్ల సహనం వహించాలి.
- మేలు కొరకు ఆయన పట్ల ఆశ కలిగి ఉండాలి.
- ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండాలి.
- ఆయన అనుమతించిన వాటినే చేయాలి.
- సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత అంటే ఉభయసంధ్యా వేళలలో పద్మాసనం గాని లేక వజ్రాసనం గాని వేసుకుని లేదా సాష్టాంగపడి ఆయనను ఘనపరచాలి.కీర్తించాలి.
పైన పేర్కొన్న "
అష్టకర్మల"న్నిటినీ కలిపి "
సర్వోన్నత పూజ" అని అంటారు. వాటిని హిందూ ధర్మం ప్రకారం మానవాళి అంతటికీ మూలపురుషులు లేక ఆది దంపతులైన శివపార్వతులు మొదలు శ్రీరామకృష్ణాదులు, సకల రుషులు, మునులు యావత్తూ ఆచరించిన మౌలిక కర్మల సముదాయం, ఆది నుండీ ఎడతెగకుండా ఆచరిస్తూ వచ్చిన "
సనాతన ధర్మపు సర్వోన్నత పూజ" విధానం ఇదే. "
ఆ ఒక్కనినే పూజించాలి, ఆ ఒక్కనినే పూజించాలి మరియు ఆ ఒక్కనిని తప్ప మరెవ్వరిని పూజింపరాదు." అని వేదశాస్త్రాలు నొక్కి వాక్కాణించేది ఆ సర్వోన్నత పూజారూపకాన్ని గురించే.
ఈవిధంగా వివిధ పూజారూపకాలను కనుక అంగీకరించకపోతే హిందూ శాస్త్రాలు స్వవచన విఘాతాన్ని (SELF CONTRADICTION) కలిగి ఉన్నాయని అంగీకరించవలసి వస్తుంది.