Posted by Sakshyam Magazine on Wednesday, July 23, 2014

నేను ఒక ధార్మిక ముస్లిం కుటుంబానికి చెందినవాడిని.నా పేరు ముహమ్మద్ ముష్తాఖ్ అహ్మద్. నా కలం పేరు అభిలాష్.నా ముస్లిమేతర సోదరులకు నేను "
ముహమ్మద్.యం.ఎ.అభిలాష్"గా చిర పరిచితుడును.నా అదృష్టం కొద్దీ ఖురాన్ గ్రంధాన్ని దాని సహజ స్వరూపంలో అధ్యయనం చేసే భాగ్యం నాకు కలిగింది.తద్వారా ఖురాన్ గ్రంధం పట్ల మూఢ భక్తి కలిగిన వారికి ఉండే సంకుచితతత్వం నాకు అబ్బలేదు.ఎలాంటి ముందస్తు భావాలు,వ్యాఖ్యానాలు లేకుండా ఖురాన్ గ్రంధాన్ని కనుక అధ్యయనం చేస్తే ఎంతో విశాల దృక్పధాలు ఏర్పడతాయి.ఖురాన్ గ్రoధం నాకు ఇచ్చిన ఆలోచనా విధానమే ఖురానేతర ధార్మిక గ్రంధాలైన వేదోపనిషత్తులు,గీతాశాస్త్రం,బైబిల్ వంటి గ్రంధాలను అధ్యయనం చేయడానికి ప్రేరకమయ్యింది.
ఒక ముస్లిం అయి ఉండి భగవద్గీతా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఒక పుస్తకాన్ని ఎలా వ్రాయగలిగారు? అన్న మీమాంస ఇటు హిందువులకు అటు ముస్లింలకు నాపట్ల కలుగకమానదు.కనుక ఆ ఉభయవర్గాలలో ఏర్పడిన ఈ మీమాంసను నివృత్తి చేయవలసిన బాధ్యత నాపై ఉంది.
ఉభయవర్గాల ఈ సందేహానికి గల కారణం ఏమిటంటే -ప్రతివర్గమూ తన వద్ద ఉన్న ధార్మిక గ్రంధాన్ని అది తమ మతవర్గానికి మాత్రమే చెందిన గ్రంధం అన్న అభిప్రయానికి గురై ఉండటం.అది కేవలం వారి అపోహ మాత్రమే.ఎందుకంటే, ఆ గ్రంధాలు-"
వర్ణం -వర్గం,ప్రాతం-దేశం" ప్రాతిపదికన కాక, "
విశ్వాసులు-అవిశ్వాసులు,
శిష్టులు-దుష్టులు" అని వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే ప్రజలను వర్గీకరిస్తున్నాయి. అంటే-ప్రజలను ఆయా "
వర్గాల పరం"గా ఆదరించక, ఆయా వ్యక్తులను,వర్గాలను వారి "
శీలంపరం"గా మాత్రమే ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయన్నమాట.దీనిని బట్టి ఆ గ్రంధాలు సార్వజనీన సందేశాన్ని ఇస్తున్నాయని స్పష్టమవుతున్నాయి. వాటి ఈ స్వభాన్ని బట్టి ఆ గ్రంధాలు ఆయా వర్గాల వద్ద ఉన్నప్పటికీ, అవి సర్వమానవుల ఉమ్మడి సొత్తు అయి ఉన్నాయి.అందుకే నేను ఒక ముస్లిం వర్గానికి చెందిన వాడినైనప్పటికీ, హిందువుల వద్ద ఉన్న గీతాశాస్త్రం వెలుగులో ఈ పుస్తకాన్ని వ్రాసే హక్కును కలిగి ఉన్నాను.ఇది నాహిందూ సోదరులకు నా వివరణ.
ఇక,ఖురాన్ కోణంలో నా ఈ సాహసం విషయమై నా వివరణ ఏమిటంటే- ఖురాన్ గ్రంధంలో ముస్లింల ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకతను సూచిస్తూ 3:119వ వచనంలో .."
మీరైతే సకల ధార్మిక గ్రంధాలనూ విశ్వసిస్తారు"అని ఖురానేతర గ్రంధాల పట్ల ముస్లింల విధానాన్ని అల్లాహ్ స్వయంగా స్పష్టపరుస్తున్నాడు.ఈ విషయం నేను ఒక ముస్లింగా గీతాశాస్త్రం పట్ల కలిగి ఉన్న అనుకూల అభిప్రాయానికి ఒక ప్రధాన ప్రేరకమయ్యింది.
ఇంకా నా ఈ రచనాక్రమం అంతా,హిందూ సమాజం "
గీతాశాస్త్ర ప్రతిపాదిత దైవభావన"ను అర్ధం చేసుకుని,ఆచరించాలన్న దానిపైనే సాగింది.ఇది సంకుచితవాదులు,చాందసవాదులు మరీ ముఖ్యంగా "
ఖూరాన్ సందేశ మూలసారాన్ని"గుర్తించని వారికి అసలు మింగుడుపడని విషయమవుతుంది.
అయితే ఖురాన్ గ్రంధాన్ని విశ్వసించని యూదులను,క్రైస్తవులను ఉద్దేశించి 5:66వ వచనంలో -"
వారు తౌరాతును,ఇంజీలును ఇంకా వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంధాలను స్థాపించి ఉంటే ఎంత బాగుండేది..!" అని అల్లాహ్ స్వయంగా అభిలషిస్తున్నాడు. ఈ అభిలాష కలిగి ఉన్న ఆ దైవాన్ని విశ్వసిస్తున్న ప్రతివాని అభిలాష కూడా అదే ఉండాలి కదా! అందుకే హిందూ సమాజం తమ వద్ద ఉన్న గీతాశాస్త్రంలోని "
దైవభావాన్ని"అర్ధం చేసుకుని, ఆచరించాలని ఒక ముస్లింగా నేనూ అభిలషిస్తున్నాను. నా ఈ అభిలాష ఖురాన్ ప్రకారం సమంజసమే కదా! ఎందుకంటే -
గీతాశాస్త్ర ప్రతిపాదిత "
దైవభావన"అచ్చం
ఖురాన్ ప్రతిపాదిత దైవభావనే కనుక.
ఇక ఖురాన్ రెండు అతివాదాలకు నడుమ ఉన్న
ఒక మధ్యేమార్గాన్ని చూపే గ్రంధం.ఇంకా అదే మార్గ జీవనవిధానం తనకు పూర్వం ఉన్న సకల ధార్మిక గ్రంధాలలో ఇప్పటికీ ఉన్నదని ప్రకటిస్తుంది.అంతే కాదు ఆ యా గ్రంధాలలో ఆ "
సనాతన మధ్యే మార్గాన్ని" కనుక ఆ యా గ్రంధాల ప్రజలు అనుసరిస్తే, వారికీ మోక్షం కలుగుతుందని సెలవిస్తుంది.ఇది నా ముస్లిం సోదరులకు నా వివరణ.
<---Back Page ఇంకా వుంది త్వరలో....
..............................................................................................................................
మరిన్ని ధార్మిక రచనలు కోసం "ప్రముఖుల రచనలు" క్లిక్ చేయండి.