Posted by Sakshyam Magazine on Tuesday, October 18, 2016

మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించిన భూతాపాన్ని అత్యవసరంగా నిలువరించాలని గత ఏడాది పారిస్ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. భూతాపానికి కారణమైన కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధనల వాడకంతోపాటు అడవులను విస్తరించాలని నిర్ణయించాయి. వాతావరణంలో కర్బనాన్ని భారీయోత్తున పీల్చుకునే అడవులు- సమర్ధ కర్బన శోషకాలు [కార్బన్ సింక్స్]. అందుకే ప్రస్తుతం దేశవైశాల్యంలో 2134 శాతాన్ని ఆక్రమిస్తున్న అడవులను 33 శాతానికి పెంచాలని భారత్ కంకణం కట్టుకుంది. 2030 నాటికి అటవీ విస్తీర్ణాన్ని పెంచి 250-300 కోట్ల టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి తొలగిస్తామని వాగ్దానం చేసింది. భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 7,01,673 చదరపు కిలోమీటర్లు. 2015 లో అవి 704 కోట్ల టన్నుల కర్బనాన్ని పీల్చుకున్నాయి. గత రెండేళ్లలోనే దేశంలోనే అడవుల విస్తీర్ణం 3,775 చదరపు కిలోమీటర్ల మేర పెరగ్గా, వృక్ష సంపద 1,306 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అవి అదనంగా 37 కోట్ల టన్నుల కర్బనాన్ని పీల్చుకున్నాయి. ఇక్కడ అడవులకు, వృక్ష సంపదకు మధ్య తేడా గుర్తించాలి. అడవి అనగానే అందులో చెట్లతో పాటు నదులు, ఏరులు, కొండలు, పచ్చిక బయళ్లు, ఖాళీ భూములూ ఉంటాయి. వృక్ష సంపద అంటే చెట్లు మాత్రమే అనుకున్న ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని పెంచితే దేశానికి పర్యావరణపరంగా మేలు జరగడమే కాదు, అపార ఆర్ధిక ప్రయోజనలూ లభిస్తాయి. దేశంలోని అడవుల ప్రస్తుత నికర విలువ 115 లక్షల కోట్ల రూపాయలు [ లక్షా డెబ్బై వేల కోట్ల డాలర్లు] అని భారత అటవీ నిర్వహణ సంస్థ [ఐఐఎఫ్ఎం] లెక్కగట్టింది. ఇది బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో నమోదైన కంపెనీలన్నింటి విలువకు సమానం. రష్యా, కెనడా, దక్షిణ కొరియాల స్థూల దేశీయోత్పత్తి [జీడీపీ] కన్నా ఎక్కువ. అడవుల నుంచి లభించే కలప, వెదురు, వంటచెరకు, పశుగ్రాసం, ఇతర అటవీ ఉత్పత్తులు, కర్బన అవక్షేపాలు, జల వనరుల పున:పూరణ, భూసార సంరక్షణ, పరపరాగ సంపర్కాల వల్ల చేకూరే ప్రయోజనాలన్నింటిని లెక్కగట్టి వేసిన మొత్తమిది!
చట్టం రాకతో కొత్త ఉత్సాహం
ఇటీవల అటవీకరణ పరిహార నిధి బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయడంతో అటవీ సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఉత్సాహంగా రంగంలోకి దూకింది. బిల్లు చట్టారుప౦ ధరించడంతో అడవుల విస్తరణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏటా రూ6,000 కోట్ల చొప్పున మొత్తం రూ.40వేల కోట్లు లభించబోతున్నాయి. ఈ నిధులతో చేపట్టే అటవీ విస్తరణ కార్యక్రమాల వల్ల 15 కోట్ల పనిదినాల సృష్టి జరగనుంది. ఈ పనిదినాలు ప్రధానంగా గిరిజన, వెనకబడిన ప్రాంతాల్లోనే అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు. అందులో 13 లక్షల హెక్టార్ల భూమిని 1980 నుంచి వివిధ అటవీయేతర ప్రాజెక్టులకు మళ్ళించారు. అటవీ భూమాల్లో ప్రాజెక్టులు చేపట్టినందుకు ప్రతిగా అనేక ప్రైవేటు కంపెనీలు, ఇతర సంస్థలు 2006 నుంచి ప్రభుత్వానికి చెల్లించిన పరిహారాలు రూ.40 వేలకోట్లకు చేరాయి. వీటిపై వడ్డీ 2,000 కోట్ల మేరకు పొగుపడింది. మొత్తం నిధుల్లో 90 శాతాన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేస్తారు. మిగిలిన 10 శాతం నిధులను కేంద్రం వద్దనే అట్టిపెట్టి అడవుల విస్తరణ కార్యక్రమం అమలవుతున్నతీరును పర్యవేక్షించడానికి వెచ్చిస్తారు.
1980 నటి ఒక చట్ట౦ ప్రకారం ఏదైనా ప్రైవేటు సంస్థ లేదా వ్యక్తి అటవీ భూమిలో ప్రాజెక్టు చేపడితే, ప్రత్యామ్నాయంగా వేరేచోట అడవిని పెంచడానికి నిర్దిష్ట పరిహారం చెల్లించాలి. ప్రాజెక్టులకు మళ్లించిన ప్రతి హెక్టారు అటవీ భూమికి రూ 5.54 లక్షల నుంచి రూ.50.72 లక్షల వరకు పరిహారం నిర్ణయించారు. జీవావరణపరంగా కీలక ప్రాంతంలో ప్రాజెక్టు నెలకొల్పుతున్నట్లయితే, ఈ పరిహరానికి అదనంగా 20 శాతం ప్రీమియం చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో అడవుల ప్రస్తుత నికర విలువ [ఎన్ పి వీ] కి నాలుగు రేట్లు ఎక్కువ ప్రీమియమూ చెలించాల్సి వస్తుంది. రాష్ట్రాలకు బదిలీ అయ్యే నిధుల్లో పెద్దభాగాన్ని క్షీణించిన అడవుల పునరుద్ధరణకు వెచ్చించాలని బిల్లు నిర్దేశించింది. మన దేశంలోని మొత్తం అడవుల్లో 40 శాతం క్షీణదశలోని అడవులే. కానీ ప్రైవేటు ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన గిరిజనులకు పరిహార నిధుల్లో సగభాగం చెల్లించాలన్న సిఫార్సును కేంద్రం ఆమోదించకోపోవడంపై విమర్శలు వచ్చాయి.
అదీకాకుండా ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకానికి ప్రభుత్వం ఎటువంటి పద్ధతులను అనుసరించబోతుందో సృష్టం కాలేదు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం నరికివేసిన అటవీ భూములకు ప్రతిగా వేరే చోట అడవులను పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని 'కాగ్ విమర్శించింది కూడా. భారత్ లో అడవుల వైశాల్యం పెరిగినా 2,51 లో భారత అటవీ సర్వే వెల్లడించింది. ఈ నష్టాన్ని అండమాన్ నికోబార్ దీవులు గణనీయంగా భర్తీ చేశాయి. ఇకడ 1932 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులు విస్తరించాయి. తమిళనాడు లో కూడా కొత్తగా 100 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అడవులు వ్యాపించాయి. 2004 సునామీ అనంతరం చేపట్టిన అటవీకరణ పధకాలే ఈ పెరుగుదలకు కారణం
హరిత భారతం
2010-15 మధ్యకాలంలో అడవులు గణనీయంగా విస్తరించిన పది దేశాల్లో భారతదేశము ఉందని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవస్థా సంస్థ [ఎఫ్ఏ ఓ] తెలిపింది. చైనా 15,42,000 హెక్టార్ల మేరకు అదనపు అడవులు పెంచి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 1,78,000 హెక్టార్లలో కొత్త అడవులు పెంచిన భారత్ ఎనిమిదో స్థాన౦లో నిలిచింది. చైనా చేపట్టిన రెండు జాతీయ కార్యక్రమాలు అడవుల పెరుగుదలకు తోడ్పడ్డాయి. చైనాలో గతంలో కొండవాలుల్లో అడవులను నరికివేసి పంట పొలాలకు మార్చారు. ఇప్పుడు అక్కడ అడవులను పునరుద్ధరించారు. తరవాత కలప కోసం అడవుల నరికివేతను నిషేధించారు. అయితే చైనా ఇప్పుడు తనకు కావలసిన కలపను ఇండోనేసియా, మలేషియా, ధాయ్ లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొంటుండటం వల్ల ఆ దేశాల్లో అడవులు తరిగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తం మీద గడిచిన రెండేళ్లలో అడవులను విస్తరించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2013 లో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24,357 చదరపు కిలోమీటర్లయితే 2015లో 24,424 చ.కి. మీలకు పెరిగిందని కేంద్రం ఇటీవల రాజ్యసభకు తెలిపింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21,759 చ.కి.మిల నుంచి 21,591 చ.కి.మీలకు తగ్గింది. అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి రెండు తెలుగు రాష్ట్రాలూ భారీ కార్యక్రమాలను ప్రారంభించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 23 శాతంగ ఉన్న అడవులను 40 శాతానికి పెంచడానికి వనం- మనం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటారు. రాగాల పదేళ్లలో ఏటా నాలుగు లక్షల ఎకరాల్లో కొత్తగా మొక్కలను నాటడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షిస్తున్నారు. ఏటా 25-30 కోట్ల చెట్లు పెంచాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడానికి వనం- మనం కార్యక్రమం తోడ్పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 25.16 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడానికి హరిత హరామ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికింద రానున్న మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచబోతున్నారు. మొత్తం మీద మానవాళి మనుగడకు అడవులు ఎంతో ముఖ్యమనే చైతన్యం అందరిలో పెరిగింది. ఈ చైతన్యాన్ని పటిష్ట కార్యాచరణగా మార్చడానికి కేంద్ర రాష్ట్రాలు నడుం బిగించడం స్వాగతించాల్సిన పరిణామం.
ఈనాడు దినపత్రిక సౌజన్యంతో