Posted by Sakshyam Magazine on Thursday, April 12, 2018
అనేక సంఘాలు ఉండటంలో తప్పు లేదు. కానీ, ఒకే క్రైస్తవంలో ఉన్న ఆ యా సంఘాల మధ్య భిన్న విశ్వాసాలు మటుకు ఉండకూడదు! బైబిల్ వంటి మహా జ్ఞాన గ్రంధం కలిగి ఉన్నప్పటికీ, యేసే మా రక్షకుడు అని చెప్పుకునే సంఘాల వారి మధ్య "యేసు ఎవరు?" అన్న విషయంలో స్పస్థత లేకపోవడం బాధాకరం! "యేసు అందరికీ ప్రభువు" (అపో||కా 10:36) అని బైబిల్లో ఉంది. కాబట్టి- "యేసే అందరికీ దేవుడు", "యేసే యెహోవా అవతారం" లేక "త్రిత్వ దైవాలలో యేసు కూడా ఒకర"ని నేటి అధిక శాతం బోధకులు ప్రచారం చేస్తున్న భిన్న, అన్య విశ్వాసాలు!!
యేసు దేవుడా? ప్రభువా?
యేసు "ప్రభువు" అని పిలువబడ్డారు. కాబట్టి "యేసే యెహోవా" అన్న భావనలో ఉన్నవారు గమనించాల్చింది - అసలు యేసును "ప్రభువు"గా, "క్రీస్తు"గా నియమించిందే దేవుడైన యెహోవా అన్నది.
మీరు సిలువ వేసిన యీ యేసునే దేవుడు (అనగా యెహోవా) ప్రభువుగాను
క్రీస్తుగాను నియమించెను. - అపోస్తలుల కార్యములు 2:36
పై వాక్యాన్ని బట్టి దేవుడైన యెహోవా , యేసును "ప్రభువుగా, క్రీస్తుగా నియమించతాన్ని బట్టి యేసుకు "ప్రభువు; "క్రీస్తు" అన్న స్థానాలు లభించాయే తప్ప యేసు, దేవుడై ఉండటం వలన ఆయన ప్రభువని పిలువబడలేదని తేటతెల్లమవుతుంది.
"ప్రభువు" అన్న పదానికి "దేవుడు" అని అర్ధమా?
"ప్రభువు" అన్న పదం పరిశుద్ధ బైబిల్లో అనేక మందికి వాడబడింది.స్వయంగా "ప్రభువులనబడినవారు అనేకులు ఉన్నారు" (1 కోరి 8:4) అని చెబుతున్న పౌలే తిరిగి "మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు" (1 కోరి 8:6) అని ప్రకటిస్తున్నాడు. దానికి గల కారణం ఏమిటో తెలియాలంటే ముందు "ప్రభువు" అన్న విశేషణం యేసును గురించి, ఏ అర్ధంలో వాడబడిందో "మూల ప్రతుల"లో చూస్తే, పూర్తీ క్రొత్త నిబంధనలో యేసుకు "ప్రభువు" (గ్రీకులో Kurious) అన్న పదం "గురువు" (Master) అన్న అర్ధంలో అనువదించడం జరిగింది. అలాగే కొంత మందికి "యజమాని" అని చెప్పబడిన సందర్భంలో సైతం గ్రీకు మూలలో "గురువు" (Master) అన్న పదమును "ప్రభువు"గా వాడబడినట్లు చూడగలం (మత్తయి 18:27, 32:34). అందుకే యేసు ఏమంటున్నారంటే...
మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు (Master).
అన్న యేసు ప్రకటనను బట్టే పౌలు, యేసును- "ప్రభువు" అనగా "గురువు" అన్న అర్ధంలో ప్రకటించాడే తప్ప, "ప్రభువు" అనగా "దేవుడు" అన్న అర్ధంలో కాదు. ఈ సాక్ష్యంలో యేసు పట్ల అతడు కలిగి ఉన్న "నిజమైన విశ్వాసము"నాకు గొప్ప గుర్తు! అంతకు ముందే పౌలు, దేవుడు ఎవరో ఈ క్రింది విధంగా ఎంతో స్పష్టంగా ప్రకటించి ఉండటం.
ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడనియు ఎరుగుదుము... మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు.
ఆయన తండ్రి (అనగా యెహోవా) -1 కోరింథీ 8:4-6
ఈవిధంగా "మనకు ఒక్కడే దేవుడు ఆయన యెహోవా" అని ప్రకటిస్తూనే " మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు" (1 కోరింధీ 8:6) అని పౌలు ప్రకటించటాన్ని బట్టి అతడు- యేసును "ప్రభువు" అనగా - "గురువు" అన్న విశ్వాసాన్ని తప్ప, నేటి బోధకుల వలే యేసు పట్ల "దేవుడు" అన్న విశ్వాసం కలిగి లేదని తెలుస్తుంది.