Posted by Sakshyam Magazine on Thursday, August 24, 2017

మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడిగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.
సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: “నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు – గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు.” ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.
పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:
* “అందరికన్న ముందున్న హిందువులు”
పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో “గోఘా” పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు: బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి. కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద “దరియా దౌలత్” అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర – – *ఈ మూడు రకాల కలప వాడేవారు.
1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ “లే హిందూ” అనే పుస్తకం వ్రాసినాడు. “ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి.” ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం “షాహీబేడే”లో చేర్చుకొన్నారు. వీనిలో “ఏషియా” అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి.
* ఆంగ్లేయుల కుటిలత్వము:
బ్రిటిషు ఓడలవ్యాపారులు భారతీయుల నౌకా నిర్మాణ కళా ఔన్నత్యాన్ని ఓర్వలేకపోయినారు. భారతీయ ఓడల్ని వాడవద్దని ఈస్టిండియా కంపెనీపై ఒత్తిడి తీసికొచ్చారు. ఈ విషయంలో అనేక విచారణలు కూడా జరిగినవి. 1811 లో కర్నల్ వాకర్ గణాంకాలతో సహా ఋజువు చేసినాడు. “భారతీయ ఓడలకు ఖర్చు తక్కువ, అవి చాలా బలంగా ఉంటాయి. బ్రిటిష్ నౌకాదళంలో కేవలం భారతీయ ఓడలనే వాడినచో చాలా పొదుపు అవుతుంది.” బ్రిటిష్ నౌకానిర్మాణ కార్మికులు మరియు వ్యాపారులు ఉభయులలో ఈ మాట చాలా భయాందోళన కలిగించింది
TAGS : How true is the man who finds the sea route to India is Vasco da Gama?
source : manahinduthvam